మహారాష్ట్ర సీట్ల పంపకంపై రాహుల్ అసంతృప్తి 1 m ago
మొత్తం 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే దశలో నవంబర్ 20న ఎన్నికలు జరిగి నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ నేతలు సూచించిన జాబితాపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులపై చర్చించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్వహించిన సమావేశంలో రాహుల్ తన అసంతృప్తిని వ్యక్తంచేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహావికాస్ అఘాడి సీట్ల పంపకాల ఏర్పాటులో భాగంగా ఇప్పటి వరకు పార్టీ 85 స్థానాలకు గానూ 48 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
ఇలా కూడా చేస్తారా ?
కాంగ్రెస్ ఎన్నికల కమిటీ (సీఈసీ)కి సమర్పించిన పేర్లను స్క్రీనింగ్ కమిటీ యథావిధిగా ఎంపిక చేయడం పట్ల రాహుల్ గాంధీ నిరాశ చెందారని ఆవర్గాలు వెల్లడిస్తున్నాయి. సీఈసీకి అందించిన అభ్యర్థుల పేర్ల జాబితా కొంతమంది మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు ప్రయోజనం కల్పించేలా ఉందని రాహుల్ అభిప్రాయపడ్డట్లు సమాచారం. సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా విదర్భ, ముంబయి వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న కొన్ని స్థానాలను ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు కేటాయించడాన్ని కూడా ఆయన ప్రశ్నించారని తెలుస్తోంది.
పంపకాలు ఇలా...
మొత్తం 288 అసెంబ్లీ సీట్లలో 255 సీట్లపై ఎంవీఏ ఒప్పందం కుదుర్చుకుంది. రానున్న ఎన్నికల్లో ఉద్ధవ్ సేన 65 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 48 స్థానాల్లోనూ, శరద్ పవార్ నేషనలిస్ట్ పార్టీ కాంగ్రెస్ 45 స్థానాల్లోనూ వెరసి మొత్తం 85 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. మూడు పార్టీలు ఇప్పటి వరకు ఒక్కో అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. అయితే, 288 సీట్లకు గాను 18 స్థానాల్లో ఇంకా సీట్ల సర్దుబాటు కాలేదు. సమాజ్వాదీ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే అబూ అసిమ్ అజ్మీ శుక్రవారం సీట్ల పంపకాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష కూటమి తమ పార్టీ అభ్యర్థులకు ఐదు స్థానాలను కేటాయించకపోతే మొత్తం 25 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపుతానని బెదిరించారు. దీంతో మహారాష్ట్ర ఎన్నికల్లో సీట్ల పంపకాల అంశం రసకందాయంలో పడింది.